నమోదు భాగస్వామ్యులు –వ్యవస్థాగత భాగస్వామ్యులు

UIDAI

ఆధార్ పర్యావరణ వ్యవస్థకు భారత విశిష్ఠ గుర్తింపు సంఖ్య ప్రాధికార సంస్థ కేంద్రకం. దీనికి సంబంధించిన బాంధవ్యాలు, కీలక మౌలిక సదుపాయాలకు బాధ్యత వహిస్తుంది. ఈ వ్యవస్థ పనితీరు అంచనా, పర్యవేక్షణ బాధ్యత, లక్ష్య సాధన దిశగా చోదకశక్తిగా పనిచేసేదీ UIDAI మాత్రమే.

రిజిస్ట్రార్లు

వ్యక్తుల గుర్తింపునకు, నమోదుకు అనుమతి పొందిన లేదా UIDAI గుర్తించినవే పాలనాధికార సంస్థలు (రిజిస్ట్రార్లు). ఒక అవగాహన ఒప్పందంద్వారా ఇవి UIDAI భాగస్వాములుగా ఉంటాయి. నిబంధనలకు లోబడి తమకు అప్పగించిన బాధ్యతలను నెరవేరుస్తాయి. నివాసుల నుంచి సమాచార సేకరణ కేంద్రాలద్వారా వివరాలన్నీ సేకరిస్తాయి గనుక ఈ సంస్థలకు ఆ వివరాలన్నీ అందుబాటులో ఉంటాయి.ఈ సంస్థలు తమంతటతాముగానీ, తాము నియమించిన ప్రతినిధులద్వారాగానీ ఆధార్ నమోదుకు సమాచార సేకరణ చేయవచ్చు. ఇందుకోసం గుర్తింపు పొందిన జాబితా నుంచి సంస్థలను ప్రతినిధులుగా ఎంపిక చేసుకోవచ్చు. లేదంటే తమ సొంత వ్యవస్థలద్వారా కూడా తగిన ప్రాతినిధ్య సంస్థలను ఎంచుకోవచ్చు.

నమోదు ప్రాతినిధ్య సంస్థలు

ఇవి రిజిస్ట్రార్లద్వారాగానీ, UIDAI ద్వారాగానీ నియమితమైనవిగా ఉంటాయి. ఆధార్ కోసం నమోదు ప్రక్రియలో జనసంఖ్యాసంబంధ, బయోమెట్రిక్ సమాచార సేకరణానుమతి కలిగి ఉంటాయి. వీటి ఆర్థిక, సాంకేతిక సామర్థ్య పరిశీలన అనంతరం ఇలాంటి సంస్థల జాబితాను UIDAI రూపొందిస్తుంది. ఈ సంస్థలు క్షేత్రస్థాయిలో కార్యకలాపాలను విధానాలకు లోబడి పర్యవేక్షించే బాధ్యత కలిగి ఉంటాయి. ఆపరేటర్లు, పర్యవేక్షకులకు శిక్షణ, నివాసుల సమాచారాన్ని CIDRకు సకాలంలో పంపడం కూడా వీటి బాధ్యతలు. ఈ ప్రాతినిధ్య సంస్థలు నమోదు కేంద్రాలను ఏర్పాటుచేసి, సమాచార సేకరణ చేయడంతోపాటు తప్పులుంటే సరిదిద్దడం, సమాచార నవీకరణ బాధ్యతను కూడా చూడాల్సి ఉంటుంది.

ఆపరేటర్లు/పర్యవేక్షకులు

నమోదు ప్రాతినిధ్య సంస్థలు నియమించే ఆపరేటర్లు నివాసుల నమోదు, జనసంఖ్యాసంబంధ, బయోమెట్రిక్ వివరాల సేకరణ బాధ్యతలు కలిగి ఉంటాయి. ఇందుకోసం నిర్దేశిత నియమనిబంధనలను అనుసరించాల్సి ఉంటుంది. నివాసుల వివరాలకు సంబంధించిన మద్దతు పత్రాల నకలు లేదా ఎలక్ట్రానిక్ నకళ్లను ఎలక్ట్రానిక్ రూపంలోకి మార్చాల్సి ఉంటుంది.

ఆధార్ నమోదుకు ఆపరేటర్లు బాధ్యులు కాగా, కేంద్రం నిర్వహణ బాధ్యత పర్యవేక్షకులది. అలాగే నిర్దేశిత ప్రక్రియలు, విధానాలు, సమాచార నాణ్యత, అవసరమైన అంశాల్లో నిర్వాహక సంస్థతో లావాదేవీలు కూడా పర్యవేక్షక సంస్థవే. ఇవి ఆధార్ కోసం నమోదు ప్రక్రియను కూడా చేపట్టవచ్చు. ప్రధానంగా ఈ ఆపరేటర్లు, పర్యవేక్షకులంతా ఆధార్ సంఖ్య కలిగినవారై, తగిన ధ్రువీకరణ పొందినవారై ఉండాలి.

సారాంశ రూపకల్పన ప్రాతినిధ్య సంస్థలు (CDAs)

ఆపరేటర్లు, పర్యవేక్షకులకు శిక్షణ సరంజామా తయారీ కోసం సారాంశ రూపకల్పన ప్రాతినిధ్య సంస్థ (CDA)లను UIDAI నియమిస్తుంది. డాక్యుమెంటేషన్, కొత్త ఆవిష్కరణలను వినియోగించుకుంటూ శిక్షణ ఉపకరణాలను సీడీఏలు రూపొందించవచ్చు. ఇందులో కంప్యూటర్ ఆధారిత శిక్షణ సరంజామా కూడా ఉండవచ్చు. ఇలా రూపొందిన ప్రతి కొత్త ఆవిష్కరణ నమోదు ప్రాతినిధ్య సంస్థలకు, ఇతరులకు UIDAI వెబ్ సైట్ ద్వారా అందుబాటులో ఉంటుంది. .

పరీక్ష, ధ్రువీకరణ ప్రాతినిధ్య సంస్థలు (TCAs)

కొత్త ఆపరేటర్లు, పర్యవేక్షకులకు ధ్రువీకరణ ఇచ్చేందుకు పరీక్ష, ధ్రువీకరణ ప్రాతినిధ్య సంస్థ (TCA)లను UIDAI నియమిస్తుంది. ఆధార్ కలిగి, ఆపరేటర్/పర్యవేక్షకులుగా శిక్షణ పొందినవారు ఈ సర్టిఫికేషన్ పరీక్షకు హాజరుకావచ్చు. ఈ పరీక్షల ఫలితాలను TCAలు UIDAIకి, నమోదు ప్రాతినిధ్య సంస్థలతోపాటు ఆపరేటర్/పర్యవేక్షకులకూ అందజేస్తాయి.

బయోమెట్రిక్ పరికరాల ధ్రువీకరణ

ఆధార్ సమాచార నమోదు, అధీకృత కార్యకలాపాలకోసం UIDAIకి అవసరమైన పరికరాల ప్రామాణికత, ధ్రువీకరణ బాధ్యతను ప్రామాణిక పరీక్ష-నాణ్యత ధ్రువీకరణ (STQC) సంచాలక కార్యాలయం నిర్వర్తిస్తుంది. ఇది ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖకు అనుబంధంగా పనిచేస్తుంది. అన్ని పరికరాల నిర్దేశిత ప్రమాణాల కార్యకలాపాలను తన వెబ్ సైట్ ద్వారా నిర్వహిస్తుంది. న్యూఢిల్లీ, మొహాలీలోని తమ ప్రయోగశాలల్లో విస్తృత ధ్రువీకరణ కార్యకలాపాలను నిర్వహిస్తూంటుంది. బయోమెట్రిక్ పరికరాలను పరీక్షించి, ధ్రువీకరించేందుకు అవసరమైన అత్యాధునిక పరీక్ష పరికరాలు ఈ ప్రయోగశాలల్లో ఉన్నాయి. మరింత సమాచారం కోసం STQC వెబ్ సైట్ చూడవచ్చు