ఆధార్ లక్షణాలు
వైశిష్ట్యం
జనసంఖ్య సంబంధ, జీవసంబంధ ప్రక్రియద్వారా పునరావృతరహితం చేయడంవల్ల ఈ విశిష్టత సాధ్యమవుతుంది. పునరావృతరహిత ప్రక్రియలో నివాసి జనసంఖ్యసంబంధ, జీవసంబంధ సమాచారాన్నిసంస్థ సమాచార నిధిలోని వివరాలతో పోల్చిచూడటంవల్ల ఈ ఖచ్చితత్వం సమకూరుతుంది. దీనివల్ల నివాసి ఒకటికన్నా ఎక్కువసార్లు నమోదు చేసుకుని ఉన్నా ఒకేఒక ఆధార్ సంఖ్య మాత్రమే ఉత్పన్నమై, మిగిలిన నమోదులన్నీ అదే వివరాలతో ఉన్నందున తిరస్కరించబడతాయి.
సులభ వాహ్యత
జాతీయస్థాయిలో చెల్లుబాటవుతుంది గనుక ఎక్కడైనా ఆన్‌లైన్‌లో ప్రమాణీకరించుకోగల వీలుంటుంది. లక్షలాది భారతీయులు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి, గ్రామాల నుంచి పట్టణాలకు వలస వెళ్లే పరిస్థితులున్న నేపథ్యంలో ఇదెంతో కీలకమవుతుంది.
యాదృచ్ఛిక సంఖ్య
ఆధార్ సంఖ్య యాదృచ్ఛికం... నిఘా రహితం. నమోదు ప్రక్రియలో కులం, మతం, ఆదాయం, ఆరోగ్యం, భౌగోళికత, తదితర వివరాలేవీ సేకరించని కారణంగా సంఖ్యదారులపై ఎలాంటి నిఘా ఉండదు.
మార్పుచేర్పులకు అనువైన సాంకేతిక నిర్మాణం
UID నిర్మాణం సార్వత్రికమేగాక మార్పుచేర్పులకు అనువైనది. నివాసుల సమాచారం కేంద్రస్థాయిలో భద్రపరచబడి ఉంటుందిగనుక దేశంలో ఎక్కడైనా ప్రమాణీకరణ సులభం. గుర్తింపు కార్డులతో ముడిపడిన పథకాలలో సమస్యలను ఇది తొలగించగలదు. దేశంలోని రెండు కేంద్రీయ సమాచార కేంద్రాల్లో రోజుకు పదికోట్ల ప్రమాణీకరణలు నిర్వహించగల సామర్థ్యం ఆధార్ ప్రమాణీకరణ సేవాకేంద్రాలకుంది. అలాగే క్షణంలో వెయ్యోవంతులో స్పందించగల చురుకైన ప్రమాణాలతో సమాచార నిధి వ్యవస్థ నిర్మితమైంది.
సార్వత్రిక సాంకేతికత
సార్వత్రిక నిర్మాణం నిర్దేశిత కంప్యూటర్ హార్డ్ వేర్ పై ఆధారపడి ఉండదు. నిర్దిష్ట నిల్వ, నిర్దిష్ట నిర్వహణ సాఫ్ట్ వేర్, సమాచార నిధి విక్రయదారు మీద ఆధారపడి ఉండదు. సార్వత్రికంగా లభ్యమయ్యే మూలవనరులతో నిర్మించడం వల్ల మార్పుచేర్పులకు వీలుంటుంది. ఒకే అనువర్తనంలో విజాతీయ సాఫ్ట్ వేర్ సహజీవనానికి ఇబ్బందులుండవు..