ఆధార్ ఉపయోగం
సమాజంలోని నిరుపేదలు, దుర్బలవర్గాల కోసం భారత ప్రభుత్వం అనేక పథకాలకు భారీగా నిధులు వెచ్చిస్తుంది. అయితే, పథకాల అమలులో పాలనపరమైన లోటుపాట్లవల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సంక్షేమ పథకాలు సజావుగా సాగిపోయేలా చేయగల విశిష్ట వేదిక రూపంలో ప్రభుత్వానికి ఆధార్ ఒక అవకాశంగా అందివచ్చింది.
ప్రభుత్వాలు, సేవా సంస్థలకు
ఆధార్ సమాచార నిధిలో వివరాలు పునరావృతం కాలేదని నిర్ధారణ అయ్యాక నివాసులకు UIDAI ఆధార్ సంఖ్య కేటాయిస్తుంది. అందువల్ల వివిధ పథకాల్లో ఈ పరిస్థితిని నివారిస్తే ఖజానాకు గణనీయంగా ప్రజాధనం అవుతుంది. అంతేకాకుండా లబ్ధిదారుల సమాచారాన్ని అత్యంత కచ్చితంగా ప్రభుత్వాలకు అందిస్తుంది. ప్రత్యక్ష లబ్ధి కార్యక్రమాలకు ఊతమిస్తూ, ప్రభుత్వాలతోపాటు ప్రభుత్వ శాఖలు/సేవా ప్రదాతలకు వివిధ పథకాలతో సమన్వయం చేసుకునే వీలు కల్పిస్తుంది. పథకాల అమలు సంస్థలు లబ్ధిదారులను తనిఖీ చేసుకుని లక్షితవర్గాలకే ప్రయోజనాలు దక్కేవిధంగా చూడటం సాధ్యమవుతుంది. ఈ కార్యకలాపాలన్నీ అంతిమంగా దారితీసేది:-
లక్షితవర్గాలకు లబ్ధితో లీకేజీకి అడ్డుకట్ట: సంక్షేమ పథకాల ప్రయోజన బదిలీకి ముందు లబ్ధిదారుల గుర్తింపు తప్పనిసరి. దీనికోసమేగాక లీకేజీలకు అడ్డుకట్ట వేసేందుకూ UIDAI తనిఖీ సేవలు దోహదపడతాయి. ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) ద్వారా రాయితీ ఆహారధాన్యాలు, కిరోసిన్ అందిస్తుండటం ఇందుకో ఉదాహరణ. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లబ్ధిదారుల హాజరు నమోదు మరో నిదర్శనం. ఇలా ఆధార్ వినియోగంవల్ల నిజమైన లబ్ధిదారులకు మాత్రమే సేవలు, ప్రయోజనాలు అందించడం సాధ్యం..
సామర్థ్యం, సార్థకత మెరుగు: : ఆధార్ వేదికద్వారా వరుసలో ఆఖరు వ్యక్తిదాకా స్పష్టమైన సమాచార దృగ్గోచరతవల్ల ప్రభుత్వాలు పంపిణీ వ్యవస్థలను మెరుగుపరచుకోవచ్చు. నిధుల కొరత నేపథ్యంలో అందుబాటులో ఉన్న విలువైన వనరులను మరింత సమర్థతతో వినియోగిస్తూ సార్థకత పొందవచ్చు.
నివాసులకు
ఆధార్ వ్యవస్థ దేశం జనాభాలో ప్రతి ఒక్కరికీ ఏకైక గుర్తింపు వనరు. ఒకసారి నమోదు చేసుకుని సంఖ్యను పొందితే ఎలక్ట్రానిక్ మార్గాల్లో ఎన్నిసార్లయినా దాన్ని వాడుకోవచ్చు. దీనివల్ల బ్యాంకు ఖాతా తెరవడం, డ్రైవింగ్ లైసెన్స్ పొందడం వంటి సేవల కోసం ప్రతిసారి ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తూ తన వ్యక్తిగత గుర్తింపు నిరూపించుకోవాల్సిన బాదరబందీ ఉండదు. ఆధార్ వ్యవస్థ పుణ్యమా అని దేశంలోని వివిధ ప్రాంతాలకు వలస వెళ్లేవారికి స్పష్టమైన విశిష్ట సంఖ్య రూపంలో లభించిన వ్యక్తిగత గుర్తింపు ఎంతగానో ఉపయోగపడుతోంది.