ఇదీ ఆధార్

ఆధార్ అన్న‌ది నిర్దేశిత త‌నిఖీ ప్ర‌క్రియ సంతృప్తిక‌రంగా ముగిసిన త‌ర్వాత దేశ‌వాసులకు UIDAI జారీచేసే 12 అంకెల‌తో కూడిన యాదృచ్ఛిక సంఖ్య. లింగభేదం, వ‌య‌సు వంటివాటితో సంబంధం లేకుండా దేశవాసులు ఎవ‌రైనా దీనికోసం స్వ‌చ్ఛందంగా న‌మోదు చేసుకోవ‌చ్చు. ఇందుకోసం ఎలాంటి రుసుము చెల్లించే అవ‌స‌రం లేదు. అయితే, జ‌న‌సంఖ్యసంబంధ‌, (డెమోగ్రాఫిక్‌) జీవసంబంధ (బ‌యోమెట్రిక్‌) క‌నీస స‌మాచారాన్ని న‌మోదు స‌మ‌యంలో అందజేయాలి. ఒక వ్య‌క్తి ఒక‌సారి మాత్ర‌మే న‌మోదు చేసుకోవాల్సి ఉంటుంది. వారి వివ‌రాలు పున‌రావృత‌ర‌హిత‌మ‌ని రూఢి చేసుకున్న త‌ర్వాత వాటి ఆధారంగా ఒకేఒక విశిష్టమైన సంఖ్య‌ను సృష్టిస్తారు. అందువ‌ల్ల జీవిత‌కాలం చెల్లుబాట‌య్యే వ్య‌క్తిగ‌త గుర్తింపు సంఖ్య రూపొందుతుంది. దీన్ని ఆన్‌లైన్‌ద్వారా ఏ స‌మ‌యంలోనైనా, ఎక్క‌డైనా వాస్త‌వ స‌మ‌యంలో తిరుగులేనివిధంగా ప్ర‌మాణీక‌రించ‌వచ్చు

డెమోగ్రాఫిక్ సమాచారము

పేరు,పుట్టిన తేదీ(పరిశీలించబడిన) మరియు వయసు(ప్రకటించబడిన), జెండర్, చిరునామా,మొబైల్ నెంబర్ (ఐచ్ఛికము)/ఈ-మెయిల్ ఐ.డి(ఐచ్ఛికము)

బయోమెట్రిక్ సమాచారము

పది వ్రేలి ముద్రలు / రెండు కను పాపల ఐరిస్ స్కాన్ , ముఖ చిత్రము

ఆధార్ సంఖ్య‌లో నిఘా లేదా వ్య‌క్తిగ‌త లేదా జాడ ప‌సిగ‌ట్టే స‌మాచారం ఏదీ ఉండ‌దు. ఇది వ్య‌క్తిగ‌త గుర్తింపు కోస‌మే త‌ప్ప పౌర‌స‌త్వ ధ్రువీక‌ర‌ణకు ఉప‌యోగించేది కాదు. దీనిద్వారా ఎలాంటి హ‌క్కులు, ల‌బ్ధికి హామీ లేదు. అయితే, ఆధార్‌ను శాశ్వ‌త ఆర్థిక చిరునామాగా వాడుకోవ‌చ్చు. త‌ద్వారా స‌మాజంలోని అణ‌గారిన‌, బ‌ల‌హీన‌వ‌ర్గాల ఆర్థిక సార్వ‌జ‌నీన‌త కోసం క‌ల్పిస్తున్న ల‌బ్ధిని పొంద‌వ‌చ్చు. అందువ‌ల్ల ఆధార్‌ను న్యాయ, స‌మాన‌త్వ‌ విత‌ర‌ణ‌కు ఒక ఉప‌క‌ర‌ణంగా చెప్ప‌వ‌చ్చు..

సామాజిక‌, ఆర్థిక సార్వ‌జ‌నీన‌త‌కేగాక‌ ప్ర‌భుత్వ‌రంగ సేవా సంస్క‌ర‌ణ‌లు, ద్ర‌వ్య అంచ‌నాల (ఫిస్క‌ల్ బ‌డ్జెట్‌) నిర్వ‌హ‌ణ‌కు ఆధార్ ఒక వ్యూహాత్మ‌క విధానోప‌క‌ర‌ణం. సౌల‌భ్యం మెరుగుద‌ల‌కు, ఎలాంటి చిక్కులు లేని ప్ర‌జా కేంద్ర‌క పాల‌న‌కు ఉప‌యుక్త‌ ప‌రిక‌రం. దేశంలోని ప్ర‌తి వ్య‌క్తికీ విశిష్ట గుర్తింపు ఇస్తున్నందువ‌ల్ల ‘డిజిట‌ల్ ఇండియా’ సౌధానికి ఆధార్ గుర్తింపు వేదిక ఒక కీల‌క మూల‌స్తంభం. ఆధార్ ప‌థ‌కం ఇప్ప‌టికే ఎన్నో మైలురాళ్ల‌ను అధిగ‌మించడ‌మేకాదు... ప్ర‌పంచంలోనే విశిష్ట జీవ‌సంబంధ ఆధారిత గుర్తింపు వ్య‌వ‌స్థ‌గా గుర్తింపు పొందింది

విశిష్ట‌త‌, ప్ర‌మాణీక‌ర‌ణ‌, ఆర్థిక చిరునామా, ఈ-కేవైసీ అన్న‌వి ఆధార్‌కు నాలుగు ప్రాథ‌మిక ల‌క్ష‌ణాలు. కాబ‌ట్టి కేవ‌లం ఆధార్ సంఖ్య వినియోగం ద్వ‌రా భార‌త ప్ర‌భుత్వం ప్ర‌తి నివాసినీ చేర‌గ‌ల సౌల‌భ్యం క‌ల్పిస్తుంది. అదేవిధంగా మునుపెన్న‌డూ లేనిరీతిలో నివాసులు త‌మ‌కు చెందాల్సిన వివిధ రాయితీలు, ప్ర‌యోజ‌నాలు, సేవ‌లను అందుకునే మార్గం సుగ‌మం అవుతుంది.

ఆధార్‌ నమోదు, విశిష్ట సంఖ్య సృష్టి గురించి మరింత తెలుసుకోవాలంటే ఈ వెబ్‌సైట్‌లోని ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ అండ్‌ ఆధార్ జ‌న‌రేష‌న్ విభాగం చూడండి